రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసే పోటీ: సోము వీర్రాజు
రాబోయే ఎన్నికల్లో ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేయబోతున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇందుకు సంబంధించి త్వరలో రోడ్డు మ్యాప్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ జనసేన కార్యాచరణతో రానున్న ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. గుంటూరు నగరంలో సోమవారం జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య ఎటువంటి అభిప్రాయా బేధాలు లేవని రెండు పార్టీలకు సంబంధించి పనిగట్టుకుని అనవసర వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. పులివెందుల వివేకానంద రెడ్డి హత్య కేసు, ఢిల్లీ క్రేజీవాల్ లిక్కర్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. అమరావతిలో కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేసి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను లెక్కచేయకుండా ఇసుక తరలింపు జరుగుతుందని ఆరోపించారు. అడ్డుకోబోయిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులపై దాడులు చేశారని మండిపడ్డారు. ఫిర్యాదులు చేసిన ఇంతవరకు కేసులు పెట్టకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.

