తిరుమలలో హోటల్స్‌కు టీటీడీ వార్నింగ్..
తిరుమలలోని ఆస్థానమండపంలో గురువారం హోటళ్ల నిర్వాహకులు, స్థానికులతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వంటకాలను అందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి అదనపు ఈవో వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్ నిర్వాహకులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భక్తులు చాలా అసంతృప్తితో వెళుతున్నారని చెప్పారు. హోటళ్ల యజమానులు చట్టబద్ధమైన నియమ నిబంధనలను పాటించాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచుకోవాలన్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం ప్రతిరోజు చేయవలసిన పనులతో కూడిన చెక్ లిస్ట్ అందిస్తుందని, దానిని తప్పకుండా పాటించాలన్నారు. టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. భక్తుల ఆరోగ్యానికి హానికరమైన చైనీస్ వంటకాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. హోటల్లో నిర్వాహకులు, పనిచేసే సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణ ధరించి భక్తులకు సేవలందించాలని, ముఖ్యంగా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడాలన్నారు.