వారికి సమాజం మనోధైర్యం ఇవ్వాలి, అదే అసలైన చికిత్స
గద్వాల: ఎయిడ్స్ బారిన పడిన బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి సమాజం మనోధైర్యం ఇవ్వాలని, అదే అసలైన చికిత్సని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితాదేవి పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాలలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపట్ల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాలన్నారు. వారికి సమాజం నుండి ఎలాంటి అవరోధాలు, మానసిక వేధింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరితో సమానంగా వారిని చూడడంతోపాటు వారిలో మనో నిబ్బరం నింపాలన్నారు. వారికి ఎప్పటికప్పుడు మెరుగైన చికిత్సలు, మందుల సరఫరా, సరైన ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వం నుండి అందే పథకాలు అందేలా చూడాలన్నారు. వైద్యాధికారులు, జిల్లా అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.