Home Page SliderNational

‘భారత్ ఆలోచనలను ప్రపంచం తెలుసుకోవాలనుకుంటోంది’-విదేశీ పర్యటన అనంతరం మోదీ వ్యాఖ్యలు

భారతదేశపు ఆలోచనలను, ఉద్దేశ్యాలను ప్రపంచం తెలుసుకోవాలనుకుంటోదన్నారు ప్రధాని మోదీ. మూడు రోజుల విదేశీ పర్యటన అనంతరం భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను భారత సంస్కృతి  గురించి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు, సభికుల కళ్లలో ఆసక్తి కనిపించిందని, భారతీయ ప్రజల ఆలోచనలు, ఆంకాంక్షలు గురించి తెలుసుకోవాలనే కోరిక ప్రపంచ ప్రజలకు ఉందని పేర్కొన్నారు. ఈ మూడురోజులలో జపాన్, న్యూగినియా, ఆస్ట్రేలియా పర్యటనలు పూర్తి చేసి, ఈ ఉదయం ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యారు మోదీ.

ఆయనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, మరి కొందరు బీజేపీ ప్రముఖులు రిసీవ్ చేసుకున్నారు. అనంతరం నడ్డా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ అడిగారని, న్యూగినియా  ప్రధాని వంగి మోదీ పాదాలకు నమస్కరించారని, ఇక ఆస్ట్రేలియా ప్రధాని మోదీజీని మోదీ ఈజ్ ద బాస్ అన్నారని గుర్తు చేశారు.  దీనిని బట్టి మోదీ నాయకత్వంలో భారత్ సాధించిన పురోగతిని, భారత్‌కు లభిస్తున్న ఆదరణను తెలుసుకోవచ్చన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ చాలామంది ప్రపంచానికి ఎందుకు కొవిడ్ వాక్సిన్ పంపిణీ చేసారని అడిగారని, అప్పుడు భారతదేశం కర్మభూమి అని, ఇది ల్యాండ్ ఆఫ్ బుద్ద, గాంధీ అని చెప్పానని, శత్రువునైనా ప్రేమించి, ఆదరించేది భారతదేశమే అని పేర్కొన్నానని తెలియజేశారు.