Home Page SliderTelangana

బూత్ స్థాయిలోనే ఆకట్టుకునేలా ప్లాన్‌.. కమిటీలపై పార్టీల దృష్టి

అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలతో పాటు పోలింగ్ బూత్‌ల స్థాయిలో ప్రచారం పైనా దృష్టి పెట్టాయి.

ఒక్కో బూత్ కమిటీ సభ్యులు 50 ఇళ్ల వాళ్లను కలిసి ప్రచారం చేసేలా ప్రణాళికలు రచించాలి.

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలతో పాటు పోలింగ్ బూత్ స్థాయిలో ప్రచారం పైనా దృష్టి పెట్టాయి. సాధారణంగా పోలింగ్ సమయంలో చీటీలు పంచడం, ఓటర్లను తరలించడం వంటి విషయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే బూత్ కమిటీలను ముందు నుంచి ప్రచారానికి వినియోగించడంపై పార్టీలు దృష్టి పెట్టాయి. తద్వారా సూక్ష్మస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక చేపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 35,356 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో సగటున 300 వరకు బూత్‌లున్నాయి. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 590,

మేడ్చల్‌లో 573, కుత్బుల్లాపూర్‌లో 549, ఎల్బీనగర్‌లో 545, రాజేంద్రనగర్‌లో 535,

మహేశ్వరంలో 511 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈసారి ప్రతి 1500 మందికి ఒకటి చొప్పున పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. దీంతో నోటిఫికేషన్ తర్వాతే వీటి వాస్తవ సంఖ్యపై స్పష్టత వస్తుంది.

కమిటీలతో కార్యకలాపాలు: అధికార పార్టీ బీజేపీ ఇప్పటికే బూత్ కమిటీలను ఏర్పాటు చేసింది. గత ఏడాది జరిగిన సంస్థాగత ఎన్నికల సందర్భంగా వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నియామకం జరిపింది. సభ్యత్వ నమోదు, గుర్తింపు కార్డుల జారీ దృష్ట్యా ఈ కమిటీలు పటిష్ఠంగా ఉన్నాయి. కాంగ్రెస్ సైతం బూత్ కమిటీలను క్రియాశీలం చేసింది. బీజేపీ కూడా వీటిపై దృష్టిపెట్టి.. నియామకం జరిపింది.

ఓటర్లను కలిసి.. ప్రస్తుత లెక్కల ప్రకారం.. ఒక్కో బూత్ పరిధిలో 2000 మంది కంటే తక్కువ ఓటర్లున్నారు. దాదాపు 500 వరకు ఇళ్లున్నాయి. ఒక్కో బూత్ కమిటీలో పార్టీలకు పది మంది చొప్పున సభ్యులున్నారు. దీంతో ప్రతి పార్టీ ఒక్కో సభ్యుడిని 50 ఇళ్లకు పంపి.. ఓటర్లను తమకు అనుకూలంగా తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. తమ పథకాలు, కార్యక్రమాలు, విజయాలను బీజేపీ బూత్ కమిటీలు ఓటర్లకు వివరిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై ప్రచారం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై బీజేపీ వివరణ ఇస్తోంది. ఇతర పార్టీలు సైతం బూత్ కమిటీలు కేంద్రంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అభ్యర్థులు సైతం రోజువారీగా బూత్ కమిటీల నేతలతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. పర్యటనల సందర్భంగా బూత్‌ కమిటీల సాయంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్‌  అభ్యర్థులు ఖరారు కాగా.. ప్రచారంలో బూత్‌ల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్థులను ప్రకటించి 55 నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా కార్యాచరణ సాగుతోంది.