పసి ప్రాణాన్ని బలిగొన్న తల్లి రీల్స్ పిచ్చి
సోషల్ మీడియా కొన్ని సందర్భాలలో మనిషుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. వీడియోలు, రీల్స్ పిచ్చిలో పడి కొందరు జీవితాలనే పణంగా పెడుతున్నారు. ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో సోమవారం చోటు చేసుకుంది. యూపీలోని వారణాసిలో పవిత్ర గంగాస్నానానికి వచ్చిన అంకిత అనే వివాహిత తన ఐదేళ్ల కుమార్తెను గంగార్పణం చేసింది. కార్తీక సోమవారం సందర్భంగా పవిత్ర గంగాస్నానానికి తన పుట్టింటి వారితో వచ్చిన ఆమె తన చిన్నారిని వెంటబెట్టుకుని వచ్చింది. అయితే స్నానం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రికార్డు చేస్తూ తన బిడ్డ తాన్యాను మరిచిపోయింది. చిన్నారి లోతైన నీటిలో కొట్టుకుపోయింది. కాసేపటి తర్వాత చిన్నారి తాన్య మిస్సయ్యిన సంగతి తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టగా, తాన్య మృతదేహం 50 మీటర్ల దిగువన నీటిలో లభ్యమైంది. అంకిత రికార్డు చేసిన వీడియోలో తాన్య అదృశ్యమైన దృశ్యాలు కనిపించడం విశేషం.