అయోధ్యలో హుండీ సొమ్ము మాయం
లక్నో (ఏడీఎన్ఎన్): అయోధ్య రామాలయ విరాళాల లెక్కింపు కేంద్రంలో జరిగిన భారీ చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని ఆరుగురు సిబ్బంది రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు విరాళాల సొమ్మును కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. తొలుత రూ.500 నోట్లను జేబుల్లో దాచుకుని బయటకు తీసుకెళ్లిన నిందితులు, ఎలాంటి అనుమానం రాకపోవడంతో తర్వాత నోట్ల కట్టలను కూడా చోరీ చేసినట్లు సిట్ గుర్తించింది.
రామాలయ విరాళాల లెక్కింపు విభాగంలో చేరిన రెండు, మూడు నెలల్లోనే ఈ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్న లోపాలు, భద్రతా తనిఖీల బలహీనతలను ఉపయోగించుకుని దుస్తుల్లో కరెన్సీ నోట్లను దాచి బయటకు తరలించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో అవినాష్ శుక్లాను ప్రధాన నిందితుడిగా గుర్తించిన సిట్, అతనిపై కీలక ఆధారాలను సేకరించింది.
శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్– ఎస్‌బీఐ ఒప్పందం ప్రకారం విరాళాల లెక్కింపు సమయంలో ట్రస్ట్, బ్యాంకు ప్రతినిధుల సమక్షంలోనే హుండీలు తెరవాలి. బయోమెట్రిక్ హాజరు, యూనిఫాం, వ్యక్తిగత వస్తువుల నిషేధం వంటి కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, వాటి అమలులో జరిగిన నిర్లక్ష్యమే ఈ భారీ చోరీకి కారణమైనట్లు సిట్ నిర్ధారించింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

