దేశానికి నాగరికతను నేర్పిన కులం పద్మశాలి- ఈటల రాజేందర్
గాజులమలారంలో పద్మశాలి సంఘం కులబాంధవుల సభలో పాల్గొన్నారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశ ప్రజలకు, మానవసమాజానికి నాగరికతను నేర్పిన వృత్తి, కులం మన పద్మశాలి కులం. దేశవ్యాప్తంగా చేనేతకు మంచి ఆదరణ ఉంది. విచిత్రమేమిటంటే ధనవంతులు, పేదవారు కూడా ఈ కులంలో ఉంటారు. పాత తరం పెద్దలు కష్టపడితేనే వారి పిల్లలకు ఈ మాత్రం కూడు, గూడు దొరికాయి. కాయకష్టం చేసి, పిల్లలను కష్టపడి చదివించారు. చేనేత కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వాలు పనిచేయవలసిన అవసరం ఉంది. కేంద్రప్రభుత్వంలో ప్రధాని మోదీ ఇప్పటికే కొన్ని స్కీములు తెచ్చారు. ఈ పార్లమెంటు పరిధిలో చిన్న,సన్నకారు పద్శశాలి సంఘాలకు బ్యాంకుల ద్వారా, వివిధ స్కీముల ద్వారా రుణాలు అందజేస్తామని మాటిస్తున్నాను. ఈ ప్రాంతంలో నీరు, పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలైనా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఈ చేనేత కళను, కులవృత్తులను వదులుకొని పట్టణాలకు వలసలు వస్తున్నారు. చేనేత కార్మికుడు 60 ఏళ్లకు రిటైర్ కాడు. ఆయన కాళ్లు, చేతులు, కళ్లు పనిచేసేవరకూ పని చేస్తూనే ఉంటాడు. ఈ పనిలో ప్రతీ అవయవం పని చేయవలసిందే. ఉపాధి పనుల్లో కూడా నాలుగు గంటలు పనిచేస్తే రూ.200 వస్తాయి. కానీ చేనేత కార్మికులు రోజంతా కష్టపడి మగ్గం నేసినా రూ.50 కూడా రాదు. కానీ వారు కులవృత్తిని వదులుకోకుండా నిబద్దతతో పనిచేస్తారు. వారికి తప్పకుండా నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. ప్రజల చుట్టూ తిరగడమే నాకు వ్యాపకం. అందుకే ఏ సమయంలో మీరు పిలిస్తే నేను వస్తానని, వీలైనంత తొందరలో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను”. అని పేర్కొన్నారు.
