Andhra PradeshNewsNews Alert

వారంలో అతిపెద్ద కుంభకోణాన్ని బయటపెడతా – లోకేష్


క్విడ్ ప్రోకో. నాకు నువ్వేమిస్తావ్.. నీకు నేను ఏమివ్వాలి. బదులుకు బదులు.. ఇలా ఎన్ని చెప్పినా దాని అర్ధం ఒకటే.. ఒకచేత్తో పని చేసి, ఇంకో చేత్తో పుచ్చుకోవడం. దానికి ఎన్ని పేర్లయినా పెట్టుకోవచ్చు. ఎలాగైనా పిలుచుకోవచ్చు. కానీ.. ఇచ్చి పుచ్చుకోవడాలు మాత్రం ఆ ఇద్దరి మధ్యే. ఇదే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న తంతు అంటూ టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. త్వరలో అతి పెద్ద కుంభకోణాన్ని బయటపెడతానంటూ ఆ పార్టీ నేత నారా లోకేష్.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. జగన్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ అవినీతి తో కూడుకున్నవేనని ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు జనసేన కూడా సర్కార్ తీరును తప్పుబడుతోంది. ప్రభుత్వరంగ సంస్ధలను నిర్వీర్యం చేస్తూ .. ప్రైవేట్ కు పెద్ద పీట వెయ్యడంలో ఆంతర్యం ఏమిటని జనసైనికులు మండి పడుతున్నారు.


ముడుపులు చెల్లిస్తే ఎంతటి పనైనా క్షణాల్లో జరిగి పోతుంది. చేయి తడపనిదే అక్కడ ఏ పనీ కాదు. రాష్ట్రానికి వచ్చిన పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ తరలి పోవడానికి కారణం వారు అడిగినంత ముట్ట చెప్పకపోవడమే అంటోంది టీడీపీ. ముఖ్యమంత్రి కార్యాలయానికి ముడుపులు అందక పోతే ఎలాంటి పెట్టుబడులు రావడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకే.. కొందరు మంత్రులు వెటకారంగా .. వ్యంగ్యంగా.. ఎగతాళిగా నోటి దూలను ప్రదర్శిస్తున్నారని , అలాంటి వారికి.. వారి వాటా వారికి ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. అధినేత మెప్పుకోసం .. వారి పనులు సజావుగా సాగడం కోసం టీడీపీ నేతలపై నోరు పారేసుకుంటున్నారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. అతి త్వరలో వారి బండారాలు బయట పెడతామని … నారా లోకేష్ అంటున్నారు.


వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఎన్ని. పెట్టుబడులు ఎన్ని అన్న విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. పరిశ్రమలను తీసుకు రావడంలో అసలు కనీసం పరిజ్ఞానం కూడా జగన్ కు లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ గతంలో చంద్రబాబు తీసుకు వచ్చినవేనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 500 ఏమయ్యాయి అంటూ నిలదీశారు. తనపై ఉన్న కేసుల నుండి బయటపడేందుకు ఢిల్లీలో కాళ్ళు మొక్కుతున్నారని జగన్ పై నిప్పులు చెరిగారు లోకేష్.


త్వరలో లోకేష్ బయటపెడతానన్న కుంభకోణం ఏంటి ? అన్నదే ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. ఇసుక వ్యాపారాలు, భూముల దందా, మధ్యం దందాలలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని లోకేష్ అంటున్నారు. ఓ రేంజ్ లో వైసీపీ పై విరుచుకు పడ్డారు. ప్రభుత్వాన్ని అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని దుయ్యబట్టారు. జగన్ అవినీతి చిట్టాకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. సీఎం దావోస్ పర్యటన వెనుక కూడా అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. కొంతమందితో రహస్య ఒప్పందాలు చేసుకునేందుకే అంత దూరం వెళ్ళారని ఆరోపించారు లోకేష్. తన దగ్గర ఉన్న కుంభకోణాలు మీడియా పరంగా బట్టబయలు చేస్తామని అంటున్నారు.