“సుప్రీం కోర్టు కేసీఆర్‌కు క్లీన్‌చిట్టేం ఇవ్వలేదు”..రేవంత్ రెడ్డి
తెలంగాణ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ ఒప్పందాలలో భారీ అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సుప్రీం కోర్టు క్లీన్ చిట్టేం ఇవ్వలేదని, కేవలం కమిషన చైర్మన్‌ను మార్చాలని మాత్రమే ఆదేశించిందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఝార్ఖండ్‌లో ప్లాంట్ నిర్మాణ పనుల్ని BHEL 18 శాతం తక్కువకు టెండర్ ద్వారా దక్కించుకుందని, అదే సంస్థకు అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్ ప్రాతిపదికన అప్పగించడం అన్యాయమన్నారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ బాధ్యతల్ని BHELకు అప్పగించారు. దానికి సివిల్ పనులు చేసే సామర్థ్యం లేదు. కేవలం సాంకేతిక అంశాలు మాత్రమే చేసే సంస్థకు మొత్తం కాంట్రాక్టులు కట్టబెట్టి, తమకు కావలసిన వారికి సివిల్ పనులు ఇప్పించుకున్నారు. ఒక్క ప్లాంటును కూడా సకాలంలో పూర్తి చేయలేదు.
బీఆర్‌ఎస్ పార్టీ కోరిక మేరకే విద్యుత్ అక్రమాలపై విచారణ కమిషన్ వేశాం. వాస్తవాలు వెలుగులోకి వస్తున్నప్పుడు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. సుప్రీం కోర్టు కేవలం విచారణ కమిషన్ చైర్మన్‌ను మాత్రమే మార్చాలంటే, మీరు విచారమ కమిషన్ రద్దు చేయాలంటూ ఆక్రోశిస్తున్నారు. విచారణ కమిషన్ ముందు కేసీఆర్ ఎందుకు హాజరు కావడం లేదు. నూతన ఛైర్మన్‌ను నియమిస్తాం. వాస్తవాలు అవే వెలుగులోకి వస్తాయంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.