Home Page SliderTelangana

ధూం ధాంగా ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం

బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించిన భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభాన్ని ఆ పార్టీ నేతలు గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. కేసీఆర్ ఇవాళ బేగంపట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 5 నిమిషాలకు పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అంతకు ముందు యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో ఆయన పాల్గొన్నారు. కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఫస్ట్ ఫ్లోర్‌లోని తన చాంబర్‌లోకి ప్రవేశించారు. తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.

స్థలం కేటాయింపు ఇలా జరిగింది!
ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలని కేసీఆర్ 2004లోనే భావించారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రాంతీయ పార్టీల కార్యాలయాల కోసం స్థలాలను కేటాయించారు. ఐదుగురు ఎంపీలున్న పార్టీలకు రాజధానిలో స్థలాన్ని ఇచ్చారు. 5గురు ఎంపీలుంటే 500 చదరపు గజాలు, 15 మందికి పైగా ఉంటే వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 16 మంది ఎంపీలుండటంతో వెయ్యి గజాల స్థలాన్ని ఇవ్వడానికి నిబంధనలు అనుమతించాయి. పార్టీ ఎంపీలు స్థలాన్ని పరిశీలించి వసంత్ విహార్‌ ఏరియాలో ఖరారు చేశారు. భూమి పూజ నిర్వహించిన రెండున్నరేళ్లకే పార్టీ నిర్మాణం పూర్తి అయ్యింది.

బీఆర్ఎస్ కార్యాలయం ప్రత్యేకతలివే..!

4 అంతస్తుల్లో 11 వేల చదరపు అడుగుల్లో పార్టీ కార్యాలయం
లోయర్ గ్రౌండ్‌ హాల్, సర్వెంట్ క్వార్టర్స్
గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, ప్రధాన కార్యదర్శుల చాంబర్లు
ఫస్ట్ ఫ్లోర్‌లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్
2, 3వ అంతస్తులో 20 గదులు, పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్లు పోగా, అందుబాటులో 18 గదులు