Home Page SliderNational

“ఆత్మగౌరవం కన్నా గొప్పది ఏదీ లేదు”: గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

లోక్‌సభ ఎన్నికలకు ముందు, గుజరాత్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కేతన్ ఇనామ్‌దార్ రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా సమర్పించారు. ఆత్మప్రబోధానుసారం, ఆత్మగౌరవం తప్ప మరేమీ లేదని రాజీనామా సందర్భంగా ఆయన చెప్పారు. తనది ఎత్తుగడ ఒత్తిడి వ్యూహం కాదని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వడోదర స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్ భట్ విజయం సాధించేందుకు కృషి చేస్తానని ఇనామ్‌దార్ అన్నారు. వడోదర జిల్లాలోని సావ్లి స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన శాసనసభ స్పీకర్ శంకర్ చౌదరికి రాజీనామా సమర్పించారు. ఇనామ్దార్ ఆత్మప్రభోదం ఆధారంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా, 2020 జనవరిలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. అయితే దానిని స్పీకర్ ఆమోదించలేదు.

మంగళవారం రాజీనామాను సమర్పించిన తర్వాత ఇనామ్‌దార్ విలేకరులతో మాట్లాడుతూ, ఇది ఒత్తిడి వ్యూహం కాదని అన్నారు. చాలా కాలంగా, పార్టీతో అనుబంధం ఉన్న కార్యకర్తలను పట్టించుకోవడం లేదని నేను భావించాను. ఈ విషయాన్ని నేను నాయకత్వానికి తెలియజేసాను” అని చెప్పారు. 11 సంవత్సరాలకు పైగా సావ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించానని, బిజెపిలో క్రియాశీల సభ్యుడిగా మారినప్పటి నుండి పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్నానని ఇనామ్‌దార్ చెప్పారు. “కానీ 2020లో నేను చెప్పినట్లు ఆత్మగౌరవం కంటే పెద్దది ఏదీ లేదు. ఇది కేతన్ ఇనామ్‌దార్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త గొంతు. పార్టీ కార్యకర్తలను విస్మరించరాదని నేను ముందే చెప్పాను” అని ఆయన అన్నారు.

“మా లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి రంజన్‌భట్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి నేను పగలు రాత్రి కృషి చేస్తాను. కానీ ఈ రాజీనామా నా ఆత్మప్రభోదానుసార ఫలితం,” అన్నారు. 2020లో ఇనామ్‌దార్ రాజీనామా చేసిన తర్వాత, సీనియర్ ప్రభుత్వ అధికారులు, మంత్రులు, నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని… పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు తనలాగే “నిరాశ” చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. తొలిసారిగా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 2017, 2022 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 సీట్లలో ప్రస్తుతం బీజేపీకి 156 ఉన్నాయి. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో పోలింగ్ నిర్వహించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.