మెడలో వస్త్రాభరణం!.. కండువాలతో టర్నోవర్ కోట్లలోనే
కండువా… రాజకీయ నాయకులు, కార్యకర్తల మెడలో వివిధ రంగుల్లో కళకళలాడే వస్త్రాభరణం. ఎన్నికల సీజన్ రావడంతో ఇటీవల వీటికి భలే గిరాకీ వచ్చింది. నాయకులు వారి వెంట వందల మంది కార్యకర్తలు తరచూ పార్టీలు మారుతుండడంతో వారు ధరించే కండువాల రంగూ మారుతూ వస్తోంది. వాటిని తయారు చేస్తున్న నేతన్నలకు, విక్రయిస్తున్న వ్యాపారులకు కొంతమేర ఉపాధి దొరుకుతోంది. నేతన్నలు అధికంగా ఉన్న రాజన్న – సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం కండువాలు, జెండాల తయారీతో రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా ఉంది. ఇదే స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా వేల మందికి వీటి తయారీ, అమ్మకం ద్వారా ఆదాయం సమకూరుతోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు వస్తాయి. ఇక్కడ 35 వేల మందికి పైగా మరమగ్గాలపై జీవిస్తూ, వేల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు.