రైతులను దగా చేస్తున్న కేసీఆర్
కేసీఆర్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షా విమర్శించారు. మునుగోడు సమరభేరీలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో ఊడపికేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారని చెప్పారు. రాష్ట్రంలో పండించిన వడ్లను కనీస మద్దతు ధరకు కొంటానని మాట ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కొనకుండా రైతులను మోసం చేసిందన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రతి రైతు పండించిన ప్రతి బియ్యపు గింజను కనీస మద్దతు ధరకు కొంటానని తాను ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నానన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇది ఆరంభం మాత్రమే అన్నారు.

కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు
కేసీఆర్ అండ్ కంపెనీ మాట తప్పే కంపెనీ. నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ చెప్పారు. అది వస్తుందా అని మునుగోడు ప్రజలను అమిత్ షా అడిగారు. జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని మాటిచ్చారు. ఇవన్నీ వచ్చాయా.. అని నల్లగొండ ప్రజలను, తెలంగాణ ప్రజలను అడుగుతున్నానన్నారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మళ్లీ ఆయనను గెలిపిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.. కానీ దళిత ముఖ్యమంత్రి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తాం
కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇది ఆరంభం మాత్రమే అన్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణలో విమోచన దినం నిర్వహిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీకి భయపడే విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో త్వరలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి వస్తారని.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గద్దెనెక్కగానే సెప్టెంబర్ లో తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తామని ఈ సభాముఖంగా మాటిస్తున్నానని అమిత్ షా చెప్పారు.

దళిత బంధు.. మూడెకరాలు ఎక్కడ..?
ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పేరుతో పది లక్షల రూపాయలు ఇస్తానన్న కేసీఆర్ ఇచ్చారా? అని దళితులందరినీ అడుగుతున్నానన్నారు. ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఎవరికైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. అందరికీ ఉపాధి అని చెప్పిన కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం అందరికీ ఉపాధి ఇచ్చారని, ప్రజల ఉపాధిని మర్చిపోయారని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా పనికొస్తోందని ఆరోపించారు. మోడీ సర్కారు రెండుసార్లు పెట్రోల్ ధరలు తగ్గించినా.. కేసీఆర్ ఒక్కసారి కూడా తగ్గించకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనం అన్నారు తెలంగాణకు మోడీ సర్కారు రెండు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా రాష్ట్రం ఇంకా అప్పుల్లో మునిగిపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ రాజీలేని కృషి నిర్వహిస్తుందని తాను మాటిస్తున్నానని అమిత్ షా అన్నారు.

