News AlertTelangana

ఆ ఇంటిపై కాకి ఈ ఇంటిపై వాలితే చస్తుంది: రేవంత్ రెడ్డి

కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలుసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ ఇంటి కాకి ఈ ఇంటిపై వాలదని స్పష్టం చేశారు. వాలితే చంపేస్తామని అంటూ ఆయన ఒక్క మాటతో పొత్తుపై తేల్చేశారు. టీఆర్ఎస్‌తో పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని వరంగల్ సభలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మాటే శాసనమని, ఆయన నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నారు.

టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని ఈ ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ చేసిన పాపాలను కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకునేందుకు సిద్ధంగా లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌‌తో కలిసేది లేదు.. విడిచిపెట్టేది లేదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు జరిగే పని కాదని.. ఇలాంటి ప్రచారంతో అంతిమంగా బీజేపీకి లబ్ధి జరిగే అవకాశముందని రేవంత్ అభిప్రాయపడ్డారు.