మైత్రేయినగర్‌లో పార్కును కాపాడిన హైడ్రా
శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లోని మైత్రేయినగర్‌లో ఎకరం పార్కుకు కబ్జాల చెర నుంచి హైడ్రా విముక్తి కల్పించింది. ఈ పార్కు స్థలాన్ని ప్లాట్లుగా చేసి కబ్జాదారుడు విక్రయించేయగా.. వివాదం వివిధ కోర్టుల్లో నలుగుతోంది. కోర్టులలో పార్కు స్థలం అని నిర్ధారణకు వచ్చినా లిటిగేషన్లతో వివాదం పరిష్కారం కాకుండా కబ్జాదారుడు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడని స్థానికులు వాపోయారు. పార్కు స్థలం ముళ్ల పొదలతో నిండిపోయి స్థానికులకు ఇబ్బందిగా పరిణమించింది. ఆ ముళ్ల పొదల నుంచి పాములు కాలనీలోని ఇళ్లకు వస్తున్నాయని.. పిల్లలు అటువైపు వెళ్లడానికి వీలు లేని పరిస్థితి నెలకొందని ప్రజావాణి ఫిర్యాదులో మైత్రేయినగర్ కాలనీ ప్రతినిధులు పేర్కొన్నారు. లే ఔట్ ప్రకారం పార్కు ఉండడంతో హైడ్రా చర్యలు తీసుకుంది. ముళ్ల పొదలతో పాటు ఎవరూ నివాసం లేని చిన్న షెడ్డులను తొలగించి పార్కును అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో మైత్రేయినగర్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎకరం పార్కును కబ్జాల చెర నుంచి విముక్తి చేయించి రూ. 40 కోట్ల ఆస్తిని కాపాడారంటూ కొనియాడారు.