గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం..పలు శాఖలకు నోటీసులు
ఆదివారం తెల్లవారుతూనే హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై తాజాగా మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై మానవహక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారణకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు హైదరాబాద్ సీపీ, ఫైర్ డీజీ, విద్యుత్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. జూన్ 30వ తేదీలోగా ఘటన పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ప్రమాదంలో 17 మంది స్థానికులు మృతి చెందిన వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. చనిపోయిన వారిలో ఎనిమిది మంది చిన్న పిల్లలు, నలుగురు మహిళలు, ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనకు సంతాపంగా గుల్జార్ హౌస్ వ్యాపారులు నేడు బంద్ ప్రకటించారు.