వర్షంతో విద్యుత్
నదీ ప్రవాహాలపై ప్రాజెక్టులు కట్టి విద్యుత్ ను తయారు చేయడం మనకు తెలుసు. కానీ సమీప భవిష్యత్తులో కురుస్తున్న వర్షాన్ని సైతం విద్యుత్ శక్తిగా మార్చే అవకాశాలు వచ్చేస్తున్నాయంటున్నారు నేషనల్ యూనివర్సిటీ సింగపూర్ పరిశోధకులు. వీరు తాజాగా వర్షపు చినుకులను విద్యుత్ శక్తిగా మార్చే మహత్తర పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్లగ్ ఫ్లో డివైస్ వర్షాన్ని కూడా పునరుత్పాదక శక్తి వనరుగా మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ సిస్టమ్, హైబ్రిడ్ ట్రైబో ఎలక్ట్రిక్ అండ్ సోలార్ ప్యానెల్ డిజైన్ తో పనిచేస్తుంది. ఇది సాంప్రదాయ హైడ్రోపవర్ సిస్టమ్స్ కంటే పదిరెట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది తుఫానుల సమయంలో కూడా విద్యుత్ శక్తిని సేకరించే అవకాశాన్ని అందిస్తుంది. సోలార్ ప్యానెల్స్ పనిచేయనప్పుడు కూడా ఇది విజయవంతంగా వర్షాన్ని విద్యుత్ శక్తిగా మార్చింది. ఇది వర్షపు నీటి కైనటిక్ ఎనర్జీని ఉపయోగిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, ఇది త్వరలోనే పూర్తిగా అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.