Andhra PradeshHome Page SliderPolitics

ఏపీ వ్యాప్తంగా ఎన్నికల మూడ్-జోరుగా పార్టీల ప్రచారం

Share with

•గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమాలతో, ప్రజల్లోకి వైసీపీ

• భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ప్రజలలో తెలుగుదేశం పార్టీ

• వారాహి యాత్రతో జనసేన

• నిస్తేజంగా భారతీయ జనతా పార్టీ

•కదలని కాంగ్రెస్

ఏపీలో ఎన్నికల ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు సహా ప్రధాన ప్రతిపక్షం  తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయని స్పష్టమవుతోంది.

•గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమాలతో, ప్రజల్లోకి వైసీపీ

అధికార వైసీపీ పార్టీ ఒకపక్క గడపగడపకు మన ప్రభుత్వం మరోపక్క జగనన్న సురక్ష కార్యక్రమాలతో అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ఇంతవరకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తోంది.  ఇంకా సంక్షేమ పథకాలు అందని వారి వివరాలు కూడా సేకరించి అటువంటి వారికి కూడా పథకాలు అందజేసే కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన మంత్రులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఇతర నాయకులు నిమగ్నమై ఉన్నారు.

• భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ప్రజలలో తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవల మహానాడులో తాము అధికారంలోకి వస్తే ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తామన్న దానిపై మొదటి విడతగా మేనిఫెస్టోను విడుదల చేసారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో పట్టణాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ మరోపక్క ప్రస్తుత ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు.

• వారాహి యాత్రతో జనసేన

జనసేన పార్టీ వారాహి యాత్ర పేరుతో అధికార వైసీపీ వైఫల్యాలను ఎండగడతూ మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. పార్టీ అధినేత పవన్ సభలకు పెద్దఎత్తున ప్రజలు హాజరవుతున్నారు.

• నిస్తేజంగా భారతీయ జనతా పార్టీ

కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ పార్టీకి ఏపీలో మాత్రం ఆదరణ కరువయ్యిందనే చెప్పాలి. ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని, మాట తప్పడం, ఏపీపై సవతి ప్రేమ చూపిస్తూ, ఉత్తరాది రాష్ట్రాలనే నెత్తిన పెట్టుకుంటున్న బీజేపీకి ఏపీలో సరైన నాయకులు కూడా లేరు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని పైకి లేవవలసిందే కానీ అధికారం మాత్రం ఆమడ దూరమనే చెప్పాలి.

•కదలని కాంగ్రెస్

దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికి పైకి లేవలేని పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అటు ఏఐసిసి గాని, ఇటు పిసిసి గాని ప్రత్యేకించి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై తలలు పట్టుకుంటున్నారు.

పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా సామాన్య ప్రజలు కూడా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సర్వేలపై ఆసక్తి చూపుతున్నారు.  తాము అధికారంలోకి వస్తామంటే తాము అధికారంలోకి వస్తామంటూ అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీ గ్రామాల్లో విస్తృతంగా పర్యటనలు సాగిస్తూ ప్రచారాలు చేసుకుంటున్నారు. మరోవైపు పొత్తుల విషయంలో ఏఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి, ఎన్నికలకు వెళ్తాయో అన్న అంశాలపై కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు.