Home Page SliderNational

కాంగ్రెస్ జోడోయాత్రలో అపశృతి

కాంగ్రెస్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ జోడో యాత్రలో నడుస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులందరూ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. సంతోఖ్ సింగ్ ఈ యాత్రలో పాల్గొన్నారు. పంజాబ్‌లోని ఫిలౌర్ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ యాత్రలో జలంధర్ ఎంపీ సంతోఖ్ సింగ్ నడుస్తుండగా ,ఉన్నట్టుండి పడిపోయారు. ఆయనను వెంటనే లూధియానాలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఎంపీ మరణవార్త తెలియగానే రాహుల్ గాంధీ హుటాహుటిన యాత్రను నిలిపివేసి ఆసుపత్రికి చేరుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పంజాబ్ మాజీ సీఎం  అమరీందర్ సింగ్ కూడా సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. సంతోఖ్ సింగ్ పంజాబ్‌లోని కాంగ్రెస్ హయాంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికలలో వరుసగా జలంధర్ లోక్‌సభ స్థానం నుండి రెండుసార్లు ఎన్నికయ్యారు. ఆయన 1946 జూన్18 న జలంధర్‌లోని ధలివాల్ ప్రాంతంలో జన్మించారు.