Home Page SliderNational

స్విగ్గీ యాప్‌లో గందరగోళం..యూజర్ ఇంటి ముందు క్యూ కట్టిన డెలివరీ బాయ్స్

స్విగ్గీ యాప్‌లో తికమక గందరగోళం ఏర్పడి, యూజర్‌ను అయోమయంలో పడేసింది. కట్ చేస్తే.. అతని ఇంటిముందు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆరుగురు డెలివరీ బాయ్స్ క్యూ కట్టారు. విషయమేమిటంటే గురుగ్రామ్‌కు చెందిన ప్రణయ్ లోయా అనే వ్యక్తి స్విగ్గీలో ఇన్‌స్టామార్ట్‌లో తనకు కావలసిన పాలు, దోశపిండి, పైనాపిల్ ఆర్డర్ చేయాలనుకున్నారు. ఆన్‌లైన్‌లో పేమెంట్ కూడా చేశారు. అయితే ఆర్డర్ క్యాన్సిల్ అని స్టేటస్ వచ్చింది. చేసేది లేక మరోసారి ప్రయత్నించారు. ఇదే పరిస్థితి రిపీట్ అవడంతో మరోసారి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. చివరికి ఆరు సార్లు ప్రయత్నించి, జెప్టో యాప్‌ను ఆశ్రయించి తనకు కావలసిన సరుకులు తెప్పించుకున్నారు. అయితే కాసేపటికే ఒకరి తర్వాత ఒకరు స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఫోన్లు చేసి, బెల్ కొట్టడం మొదలు పెట్టారు. చివరికి అతని ఇంటివద్ద ఆరుగురు స్విగ్గీ డెలివరీ బాయ్స్, 20 లీటర్ల పాలు, 6 కేజీల దోశపిండి, 6 ప్యాకెట్ల పైనాపిల్‌ తీసుకొచ్చారు. అయితే తన అనుభవాన్ని ఫొటో తీసి ఎక్స్ వేదికగా పోస్టు చేస్తూ ఇన్ని నేనేం చేసుకుంటానంటూ వాపోయాడు. ఈ పోస్టు గంటల్లోనే వైరల్ అయి, కొందరు వ్యక్తులు వారికి కూడా కొన్ని సందర్భాలలో ఇలా జరిగిందంటూ కామెంట్లు పెట్టారు. మొత్తానికి ఈ పోస్టుతో ఫేమస్ అయ్యాడా వ్యక్తి.