కుప్పకూలిన భవనం.. ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
బెంగళూరులో నిర్మాణంలో ఉన్న 4 అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. భవనం యజమానులు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు హన్నూర్ పోలీసులు తెలిపారు. నిందితులపై బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ చట్టంలోని వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం భవన యజమాని మునిరాజరెడ్డి కుమారుడు భువన్‌రెడ్డి, కాంట్రాక్టర్ యునియప్ప తమ అదుపులో ఉన్నారని బెంగళూరు ఈస్ట్ డీసీపీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా మంగళవారం సాయంత్రం బెంగళూరులో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. దాంతో పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కొందరు సురక్షితంగా బయటపడగా.. ముగ్గురు మృతిచెందారు.

