అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సీజేఐ
దిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI B R Gavai) అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో విధులకు హాజరవుతారని పేర్కొన్నాయి. జులై 12న హైదరాబాద్ లోని నల్సార్ న్యాయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. తర్వాతే ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తోంది. అదేరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్’ అనే అంశంపై జస్టిస్ గవాయ్ ప్రసంగం చేశారు. బాబాసాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ – రాజ్యాంగ సభ- భారత రాజ్యాంగం’ పేరిట పోస్టల్ కవర్ విడుదల చేశారు.