జోష్ లో చంద్రబాబు..ఇక పూర్తిగా జనంలో ఉండేలా కార్యాచరణ
ఏపీలో తెలుగుదేశం పార్టీ లో ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు జోష్ ను నింపింది. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మూడింటిని, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో మరో స్థానాన్ని దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ అదే జోష్ లో జనం బాట పట్టేందుకు నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక పూర్తిగా జనం మధ్య నేతలు ఉండేలా ఆ పార్టీ అధినేత చంద్రబాబు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా రెండు రాష్ట్రాల నేతల సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం తో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

ఈనెల 28వ తేదీ నుంచి వరుస కార్యక్రమాలకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు ప్రజా సమస్యలపై పోరాటాలు సంస్థాగత కార్యక్రమాలు మిళితంగా కార్యాచరణను రూపొందించారు. ఈ నెల 28న హైదరాబాదులో పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత హైదరాబాద్‌లో పాలిట్ బ్యూరో మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో మే లో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు ప్రజా సమస్యలపై చర్చ తీర్మానాలు రూపొందించనున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ 42 ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 29న హైదరాబాదులో పార్టీ ప్రతినిధుల సభను కూడా నిర్వహించనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే సభకు రెండు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశాలు అనంతరం చంద్రబాబుతో సహా రాష్ట్ర నాయకత్వం నేతలు అంతా మళ్లీ జనంలోకి వెళ్లేలా ప్రణాళికలు తయారు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని ప్రజలతో పంచుకోవడంతో పాటు ఇదేం కర్మ మన రాష్ట్రానికి నిర్వహణ, ప్రజా సమస్యలపై నియోజకవర్గ జిల్లా స్థాయి పోరాటాలకు కసరత్తులు చేస్తున్నారు. చంద్రబాబు నుంచి గ్రామస్థాయినేత వరకు అంతా క్షేత్రస్థాయిలో ఉండేలా కార్యక్రమాల రూప కల్పన జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అన్ స్టాప్లుబుల్ అంటూ పేర్కొన్న చంద్రబాబు ఆదిశగా వ్యూహాలు రచిస్తున్నారు. క్యాడర్ లో ఎన్నికల ఊపు తీసుకొచ్చే దిశగా ప్రణాళికలు తయారు చేశారు. దీనిలో భాగంగానే పార్టీ కార్యక్రమాల నిర్వహణ రోడ్డు మ్యాప్ ను రెడీ చేశారు ఒకవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలను పార్టీకి చేరువ చేసేందుకు శ్రమిస్తున్నారు. దీంతో చంద్రబాబు జోష్ లో ఉన్నారని రానున్న ఎన్నికలకు అస్త్ర శస్త్రాలు రెడీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

