అమెరికాలో కార్చిచ్చు..3 వేల ఎకరాలు దగ్దం
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో అత్యంత విలాసవంతమైన ఖరీదైన ప్రదేశాలను కార్చిచ్చు ముట్టడించింది. దాదాపు 3 వేల ఎకరాల స్థలంలో ప్రముఖుల ఇళ్లను కాల్చి బుగ్గి చేసింది. ఇక్కడ సంపన్న వర్గాలు నివసించే ది పాలిసాడ్స్ అనే ప్రాంతంలో ఈ దవానలం వ్యాపించింది. దాదాపు 30 వేల మంది తమ సామాగ్రి, వాహనాలను సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. వీధుల్లో పొగ కమ్మేసింది. అక్కడ కొండలపై రోడ్లు ఇరుకుగా ఉండడం, గాలులు బలంగా వీస్తూండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ రాత్రి వేళలో గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 13 వేల నిర్మాణాలు కార్చిచ్చు కారణంగా భస్మమయిపోయాయని అగ్నిమాపక సంస్థ తెలిపింది. అక్కడ బెవర్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్, మలిబు, శాన్ ఫెర్నాండో ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ కార్చిచ్చును ఆర్పడానికి విమానాలు, హెలికాఫ్టర్లు, బుల్డోజర్లు రప్పించారు. లక్ష మంది ప్రజలు కొన్ని గంటలుగా కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు.