భూమా అఖిల ప్రియ టీడీపీ హైకమాండ్ కు వార్నింగ్..
ఏపీలోని ఆళ్ళగడ్డ మినీ మహానాడులో భూమా అఖిలప్రియ టీడీపీ హైకమాండ్ కు వార్నింగ్ ఇచ్చారు. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. తమకు తెలియకుండా నియోజకవర్గంలో ఎవరికి పదవులు ఇచ్చినా ఊరుకోబోమని తేల్చి చెప్పారు. వారిని ఊరిలోకి కూడా అడుగుపెట్టనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. పని చేసే వాళ్లకు, పార్టీకి అంకితమయ్యేవాళ్లకు, తమను నమ్ముకున్నవాళ్లకు తానే పదవులు ఇప్పిస్తానని భూమా అఖిల తెలిపారు. లోకేష్ వద్దకు తాను శ్రీకాంత్ అనే నాయకుడిని తీసుకెళ్లి పదవి కోసం సిఫార్సు చేశానన్నారు. కానీ అదే మండలం నుంచి ముక్కు మోహం తెలియని వాళ్లు ఆ పదవి కోసం పోటీ పడితే మాత్రం ఆళ్లగడ్డలో అడుగు కూడా పెట్టనివ్వబోనంటూ అఖిల వార్నింగ్ ఇచ్చారు. అలాగే అధిష్టానం కూడా ఇలాంటి అనామకులకు పదవులు ఇవ్వొద్దంటూ అఖిల ప్రియ కోరారు.

