Breaking NewsHome Page SliderSpiritual

భ‌ద్రాద్రి రాములోరి క‌ళ్యాణోత్స‌వ టికెట్లు ఆన్ లైన్‌లో..

భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు సెక్టార్ టికెట్లను బుధవారం నుంచి ఆన్‌లైన్లో విక్రయించనున్నట్లు ఈవో రమాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. దేవస్థానంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 12 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 6న శ్రీరామనవమి వార్షిక కల్యాణాన్ని, 7న శ్రీ స్వామివారి పట్టాభిషేక మహోత్సవాన్ని మిథిలా మండపం ప్రాంగణంలో కూర్చొని నేరుగా తిలకించేందుకు సెక్టార్ టికెట్లను కొనాల్సి ఉంటుంది. https://bhadradritemple.telangana.gov.in/ నుంచి వీటిని పొందవచ్చని ఈవో పేర్కొన్నారు. రూ.7,500 విలువైన టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. వారికి స్వామివారి శేష వస్త్రాలైన చీర, పంచె, 400 గ్రాముల కల్యాణ లడ్డూ, కల్యాణ తలంబ్రాల ప్యాకెట్, సచిత్ర రామాయణ పుస్తకం ఇస్తారు. అదే రోజున ప్రధాన ఆలయంలో ధ్రువమూర్తులను దర్శించుకోవచ్చు. రూ. 2,500, 2,000, 1,000, 300, 150 విలువైన టికెట్లలో ఏది కొనుగోలు చేసినా ఆ ధరకు సంబంధించిన విభాగంలో ఒకరికి ప్రవేశం ఉంటుంది.భద్రాచలం రాలేని భక్తులు ఆన్‌లైన్‌లో రూ.5 వేలు చెల్లించి పరోక్ష పూజ నమోదు చేసుకునే అవకాశముంది. వారికి పూజచేసి కండువా, జాకెట్‌ ముక్క, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, పటిక బెల్లం ప్రసాదాన్ని వారి చిరునామాకు పంపిస్తారు. రూ.1,116 చెల్లించిన వారికి ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, పటిక బెల్లం ప్రసాదం అందిస్తారు.