కాలయముడిగా మారుతున్న కేర్ టేకర్లు
తిరుపతి: ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మడానికి లేకుండా ఉంది. నమ్మిన బంటులా ఉంటూనే వెన్నుపోటు పొడుస్తున్నారు. పెద్దవయసులో ఆసరా కోసం కేర్ టేకర్స్ ని పెట్టుకుంటే వారే కాలయముడిగా మారుతున్నారు. ఇటీవల విజయవాడలో కేర్ టేకర్ ఒక వృద్ధుని కేర్ టేకర్ హత్య చేసిన ఘటన మరువక ముందే ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కూడా అలాంటి ఘటనే వెలుగు చూసింది. రేణిగుంట రోడ్డులోని సీపీఐర్ విల్లాస్ లో ఈ ఘటన జరిగింది. కేవలం 8 గ్రాముల బంగారు కమ్మల కోసం కేర్ టేకర్ 73 ఏళ్ల ధనలక్ష్మి అనే మహిళను హత్య చేశాడు. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి షణ్ముగంకు కేర్ టేకర్ గా రవిని అనే వ్యక్తిని పెట్టాడు కొడుకు శివ ఆనంద్. ఇంట్లో మేనత్త ధనలక్ష్మి కూడా ఉంది. వర్క్ ఫ్రం హోం పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శివ ఆనంద్ ఒక మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన కేర్ టేకర్ హంతకుడిగా మారాడు. పక్షవాతంతో నడవలేని లేవలేని పరిస్థితుల్లో ఉన్న షణ్ముగం పడుకుని ఉన్నాడు. హాల్‌లో దివాన్ పై ధనలక్ష్మి నిద్ర పోయింది. ఇంట్లో శివ ఆనంద్ లేకపోవడం అనువుగా భావించిన కేర్ టేకర్ రవి అనుకున్న ప్లాన్ ను అమలు చేశాడు. ధనలక్ష్మి గొంతు కోసి ఆమె చెవులకు ఉన్న 8 గ్రాముల బంగారు కమ్మలు ఎత్తుకెళ్లాడు కేర్ టేకర్ రవి. ఏడాదిగా కేర్ టేకర్ రవిపై ఎలాంటి అనుమానం లేకుండా ఇంట్లో మనిషిగా చూసుకున్నాడు శివ ఆనంద్. ఇంతలోఉద్యోగరీత్యా హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు 22) హైదరాబాద్ వెళ్లిన శివ ఆనంద్ కు షాక్ ఇచ్చాడు కేర్ టేకర్ రవి. శివ ఆనంద్ మేనత్త ధనలక్ష్మి వద్ద ఉన్న ఎనిమిది గ్రాముల బంగారు కమ్మలను కాజేసేందుకు ఏకంగా ఆమె గొంతునే కోసి చంపేశాడు. రక్తపు మడుగులో ధనలక్ష్మి మృతి చెందగా ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను కాజేసి రవి పరార్ అయ్యాడు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేర్ టేకర్ ను హంతకుడిగా తేల్చారు. పరారీలో ఉన్న కేర్ టేకర్ రవి కోసం గాలిస్తున్న పోలీసులు, ధనలక్ష్మి హత్య కేసులో నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.