హత్య రహస్యాన్ని బయటపెట్టిన ఆటో డ్రైవర్..
ఒక కవర్లో మూటలా కట్టిన మృతదేహాన్ని చెత్తకుప్పగా నమ్మించి ఆటోను మాట్లాడుకుని బయలుదేరారు నిందితులు. అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ నిలదీయగా విషయం బయటపడింది. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ పోలీసులు ఈ హత్య రహస్యాన్ని ఆటో డ్రైవర్ సహాయంతో చేధించారు. కూతురు పెళ్లి విషయంలో గొడవలు పడిన భర్తను కరెంట్ షాక్ పెట్టి హత్య చేసింది మిత్రహిల్స్కు చెందిన కవిత. ఈ హత్యలో ఆమెకు సోదరి జ్యోతి, ఆమె భర్త మల్లేష్ సహకరించారు. వారు ముగ్గురూ మృతదేహాన్ని కవర్లో చుట్టి జోగిపేట వద్ద పూడ్చి పెట్టేందుకు ఆటో మాట్లాడుకున్నారు. ఆటో డ్రైవర్ వలీనాయక్ మృతదేహం వాసన రావడంతో అనుమానం వచ్చి నిలదీయగా, తమను తిరిగి మిత్ర హిల్స్ వద్దే దింపాలని చెప్పారు. వారిని అక్కడ దింపిన అనంతరం కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వలీనాయక్. దీనితో పోలీసులు నిందితులను అరెస్టు చేసి, వారి సెల్ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.