‘ఏబీవీపీ నాయకులపై దాడులు హేయమైన చర్య’..కేంద్రమంత్రి
బాసర త్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతిప్రియ కోసం న్యాయపోరాటం చేస్తున్న ఏబీవీపీ నాయకులపై దాడులు చేయడం హేయమైన చర్య అని కేంద్రమంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. నాలుగు రోజుల క్రితం బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యకు పాల్పడినందుకు నేడు ఏబీవీపీ అక్కడ ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేశారు. స్వాతి ప్రియ కుటుంబానికి న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్న ఏబీవీపీ నాయకులపై పోలీసులు, బాసర త్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది విచక్షణా రహితంగా దాడి చేశారని ఆయన ఆరోపించారు. విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, న్యాయమైన వారి డిమాండ్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అరెస్టు చేసిన ఏబీవీపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

