‘ఫిట్‌నెస్ అనేది వయసుతో పోరాటం కాదు’…నీతా అంబానీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన ఫిట్‌నెస్ జర్నీ గురించి విశేషాలు పంచుకున్నారు. తన వయసు 61 ఏళ్లని, ఈ వయసులో కూడా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండడానికి కారణం తన జీవనశైలి, వ్యాయామం అని పేర్కొన్నారు. వయసుకు తగినట్లు వ్యాయామాలు చేయాలని, వయసనేది ఒక సంఖ్య మాత్రమేనని పేర్కొన్నారు. ఫిట్‌నెస్ అనేది వయసుతో పోరాడడం కాదు, పాజిటివిటీతో స్వీకరించడం అని, ప్రతీ మహిళా తన ఆరోగ్యం కోసం 30 నిమిషాలు కేటాయించాలని, అది స్వీయ సంరక్షణకు, శ్రేయస్సుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.అన్ని వయసుల మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మహిళలు దృఢంగా ఉండాలని అప్పుడే వారి కుటుంబమంతా కూడా ఆరోగ్యంగా ఉంటారన్నారు. తమ జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మహిళలు విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.

