Home Page SliderNational

పార్శ్వనొప్పి రాకుండా తగు జాగ్రత్తలు!

పార్శ్వనొప్పి (మైగ్రేయిన్) తలనొప్పి బాధిస్తోందా, కొన్నిసార్లు అది వస్తున్న సంగతి ముందే తెలుసుకోవచ్చు. ఒకవేళ తీవ్రం కాకుండా ముందు జాగ్రత్త పడవచ్చు. దీనికి సిద్ధంగా ఉండటం, శరీరంలో ఏయే మార్పులు వస్తున్నాయో అబ్జర్వ్ చేయడం ముఖ్యం.

కొందరికి పార్శ్వనొప్పి వచ్చేముందు మలబద్ధకం లేదా నీళ్ల విరేచనాలు. మూడ్ మారటం, మెడ బిగుసుకుపోవడం, కొన్ని పదార్థాలు, పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటి హెచ్చరిక లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవి కొద్ది గంటల నుండి రెండు రోజుల ముందు వరకూ ఎప్పుడైనా రావచ్చు. మరికొందరికి కళ్లచుట్టూ కాంతి వలయాలు కనిపించొచ్చు. ఈ సమయంలో ఆకారాలు, మిరుమిట్లు గొలిపే కాంతులు, ప్రకాశవంతమైన మచ్చల వంటివి చూడవచ్చు. చూపు తగ్గొచ్చు. చెవిలో శబ్దాలు గింగురులు తిరగవచ్చు లేదా సంగీతం వినిపించొచ్చు. కాళ్లు, చేతుల మీద సూదులతో గుచ్చుతున్నట్లు అనిపించవచ్చు.

వెంటనే డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకోవాలి. వీలుంటే విశ్రాంతి తీసుకోవాలి. సైలెంట్‌గా ఉన్న గదిలో నిద్రించాలి. కొందరికి కాఫీ, టీ తాగితే  ఉపశమనం కలగొచ్చు. అయితే అదేపనిగా వేడి కాఫీలు తాగొద్దు. చిన్న ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఐస్ ముక్కలు వేసి తల లేదా మెడ మీద పెట్టుకోవచ్చు. కొందరికి వేడి కాపడం రిలీఫ్ ఇస్తుంది. బాడీకి తగినంత నీరు తాగుతూండాలి.

చేయకూడనివి: మరీ అతిగా మందులు వాడొద్దు. నెలకు 10 రోజుల కన్నా ఎక్కువగా నొప్పి మందులు వేసుకుంటున్నట్టయితే అతిగా వాడుతున్నట్టే. ఇది తలనొప్పి ఎక్కువయ్యేలా చేస్తుంది. భోజనం మానుకోవద్దు. లైట్‌గా టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు వేళకు తినాలి. భోజనానికీ ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండొద్దు. ఒత్తిడికి గురికావద్దు. మైగ్రేయిన్ గురించి అతిగా చింతిస్తుంటే నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది. మర్దన లేదా ప్రాణాయామం, ధ్యానం చేసి పద్ధతులను పాటించాలి.