కలెక్టరేట్ పైకి ఎక్కి రైతు హల్చల్
అధికారుల చుట్టూ తిరిగినా భూసమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ వ్యక్తి సోమవారం మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి.. ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు. అరగంటకు పైగా ఈ పరిణామం చోటు చేసుకోగా… సిబ్బంది హామీతో కిందకు దిగాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లాలోని వేలిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన పట్నం రమేష్ తన పేరిట ఉన్న 18 గుంటల భూమిలో 3 గుంటల భూమిని భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. మిగిలిన 15 గుంటల భూమి రమేష్ పేరిట పట్టా ఉండగా ధరణిలో అతని ఆధార్ కార్డు వివరాల బదులు కొడుకు సురేందర్ వివరాలు నమోదయ్యాయి. దీంతో రైతు భరోసా, పీఎం కిసాన్ ఆర్థిక సహాయం అందడం లేదు. ఈ విషయమై సురేందర్ పలుమార్లు రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజావాణిలో అర్జీ ఇచ్చినా పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురైన సురేందర్ రెండు అంతస్తుల కలెక్టరేట్ భవనంపైకి ఎక్కాడు. పైనుంచి దూకుతానంటూ అరగంట పాటు హల్ చల్ చేశాడు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని కలెక్టరేట్ సిబ్బంది నచ్చజెప్పడంతో కిందకు దిగాడు.