డేంజర్లో ఢిల్లీ సీఎం..
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అతీశీని అరెస్టు చేసే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహిళా సమ్మాన్ యోజన’, ‘సంజీవని యోజన’ వంటి పథకాలు కొందరికి నచ్చలేదన్నారు. వీటికి సంబంధించి ఢిల్లీ వాసులను హెచ్చరిస్తూ వార్తా పత్రికలలో ప్రకటనలు వచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వం అలాంటి స్కీములు పెట్టలేదని, వృద్ధుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం ఎవరికీ లేదని, ఢిల్లీలో ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో సంజీవని పథకం లేదని ఈ వార్తల సారాంశం. దీనితో కేజ్రీవాల్ వాటిని ఉద్దేశించి, ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘ఆప్ తీసుకొచ్చిన పథకాలు నచ్చని కొందరు త్వరలోనే ఒక తప్పుడు కేసులో ముఖ్యమంత్రి అతిశీని అరెస్టు చేస్తారు. ఆప్ నాయకుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తారు’ అంటూ రాశారు. ఈ విషయంపై నేడు మీడియా సమావేశం నిర్వహిస్తానని పేర్కొన్నారు.

