ఈ నెల 8న సీఎం రేవంత్ పాదయాత్ర
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న పాదయాత్ర చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు ఈ పాదయాత్ర చేపట్టనున్నారు. వలిగొండ-బీబీనగర్ మధ్య ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. మూసీ పునరుజ్జీవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్ లోని మురికి నీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలను కలుపుకొని అధ్వాన స్థితిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కాలుష్యంతో కూడిన ఆ నీటి కారణంగా పరీవాహక ప్రాంతంలో పంటలు కూడా పండని దుస్థితి ఏర్పడిందని పలుమార్లు సీఎం చెప్పారు. పశువుల పాలు కూడా ఎర్రగా వస్తున్నాయని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయ విమర్శలను తిప్పికొట్టేందుకు, ప్రజలకు వాస్తవ పరిస్థితిని,ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విడమర్చి చెప్పేందుకు సీఎం సిద్ధమయ్యారు.

