Home Page SliderNational

కాంగ్రెస్‌లో చేరనున్న వైఎస్ షర్మిల

ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా  వైఎస్ షర్మిల ఆయనకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అప్పటినుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహగానాలు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం,పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్‌తో తాజాగా భేటి అయ్యారు. కాగా వీరి సమావేశంలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు కోమటిరెడ్డికి డీకే చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ విషయంలో నేతల అభ్యంతరాలపై సమాలోచన కూడా చేస్తున్నట్లు డీకే శివకుమార్ కోమటిరెడ్డితో చెప్పినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో వైఎస్ఆర్‌టీపీ పార్టీ విలీనం అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.