Home Page SliderNational

ఆర్మీ శిబిరంలో ఆగంతకుల కాల్పులు

పంజాబ్‌లోని ఉగ్రమూక కలకలం సృష్టించింది. ఏకంగా మిలటరీ ఏరియాలోనే చొరబడింది. పంజాబ్‌లోని బఠిండాలో ఏ సైనిక శిబిరంలో ఈ రోజు తెల్లవారు జామున నాలుగున్నర గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సైనిక స్థావరంలోని శతఘ్ని యూనిట్‌లో ఆఫీసర్స్ మెస్‌లో చోటు చేసుకుంది. ఆ ప్రదేశంలో సైనిక కుటుంబాలు నివసిస్తున్నాయని, పౌరుల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.

రెండురోజుల క్రితం ఒక ఇన్సాస్ రైఫిల్, 28 తూటాలు కనిపించకుండా పోయాయి. ఇప్పుడు ఈ సంఘటనతో ఎవరో వాటిని దొంగిలించి ఈ చర్యకు పాల్పడవచ్చని భావిస్తున్నారు. కాల్పులు వినిపించగానే క్విక్ యాక్షన్ బృందాలు ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పంజాబ్ పోలీసులను మిలటరీ అధికారులు అనుమతించలేదు. దీనితో సరైన సమాచారం వెల్లడి కాలేదు. ఉగ్రవాదుల దాడి కాకపోవచ్చని పోలీసులు అంటున్నారు. పంజాబ్‌లోని బఠిండా చాలా కీలకమైన సైనిక స్థావరం. 10 వ కోర్ కమాండ్‌కు చెందిన దళాలు, ఆపరేషనల్ ఆర్మీ యూనిట్లు, కీలక యుద్ధపరికరాలు ఇక్కడ ఉన్నాయి.