ఉగాది రోజు చేయాల్సిన పనులేంటంటే?
హిందూ ధర్మం ఆచార, వ్యవహారాల సముదాయం. దేవీ దేవతల పూజలు, ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధన కూడా మన సంస్కృతిలో భాగంగా కలిసిపోయింది. ప్రకృతిలో రుతువులననుసరించి వచ్చే మార్పులతో పాటు హిందూ పండుగలు కూడా వస్తూంటాయి. జడమైన చలికాలానికి వీడ్కోలు పలుకుతూ, ఉత్సాహం మేల్కొలిపే వెచ్చని వేసవికి స్వాగతం పలికే కొత్త సంవత్సరపు తొలి దినమే ‘ఉగాది’ . చైత్రమాసంలో పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాము.
సంవత్సరంలోని ‘ఉత్తర, దక్షిణాయనముల ద్వయ సంయుతమే యుగం’. యుగానికి ఆదిదినమే యుగాది. దీనినే ఉగాది అని వాడుక భాషలో పిలుస్తాము. ఈ సంవత్సరం ఉగాదిని ‘శోభకృత్’ నామసంవత్సరంగా పిలుస్తారు. శోభకృత్ అంటే శోభాయమానంగా, అందంగా ఏర్పడినదని అర్థం.

కష్టసుఖాల సమ్మేళనమే జీవితం ఈ విషయాన్ని మనకు సంకేతంగా తెలియజేస్తుంది ఉగాది పచ్చడి. తీపి, చేదులతో పాటు వగరు, ఉప్పు,కారం,పులుపు రుచులను కూడా ఉగాది పచ్చడి పరిచయం చేస్తుంది. ఏ రుచికి ఆరుచే ప్రత్యేకం. అలాగే వ్యక్తుల జీవితాలలో జరిగే రకరకాల సంఘటనలు కూడా వివిధ రుచుల వంటినే అన్నింటినీ భరించి, సహిస్తూ, పోరాడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ మధ్యమధ్య సంతోషాన్ని కూడా పొందుతూ ఉంటారు మనుష్యులు. దైవాన్ని ధ్యానిస్తూ దైవబలంతో పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడగట్టుకొమ్మనే జీవిత సత్యం దీనిలో నిబిడీకృతమై ఉంది.

ఉగాది రోజున చేయాల్సిన పనులేంటో పెద్దలు నిర్థేశించారు. ఈ రోజున పొద్దున్నే లేచి, తలారా స్నానం చేసి శుచిగా భగవంతుని ప్రార్థన చేసుకోవాలి. ఈ కాలంలో వచ్చే లేత మామిడి కాయలు, వేప పువ్వు, కొత్తబెల్లం, కొత్త చింతపండు, మిరియాలు, ఉప్పులతో ఉగాది పచ్చడిని షడ్రుచులతో తయారు చేసి ఆరగించాలి. అనంతరం 12 రాశులవారు పంచాగం శ్రవణం చేసి, వారి రాశి ఫలితాలను తెలుసుకోవాలి. దేవాలయ సందర్శనం చేయాలి. వీలైనంతలో దానాలు చేయవచ్చు. తనకు, తనవారందరికీ ఈ నూతన సంవత్సరంలో అంతా శుభాలు కలగాలని కోరుకుంటూ దైవప్రార్థన చేసుకోవాలి.

