కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఇంట్లో 6 కోట్ల నోట్ల కట్టలు స్వాధీనం
ఒకరోజు క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత సుమారు ₹ 6 కోట్లు దొరికాయని అధికారులు శుక్రవారం తెలిపారు. ఎన్నికలకు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఇలా బీజేపీ ప్రయత్నిస్తోందన్న విమర్శలకు సాక్ష్యం లభించినట్టయ్యిందంటూ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది. త్వరలో కర్నాటక అసెంబ్లీ నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఇది పార్టీకి భారీ ఇబ్బందిగా మారింది. లోకాయుక్త అవినీతి నిరోధక విభాగం, రాష్ట్ర అంబుడ్స్‌మెన్… బిజెపి ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ ఇంటిపై దాడి చేసి భారీ నగదు కుప్పలను కనుగొంది. అధికారులు ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు.

ప్రముఖ సబ్బు బ్రాండ్ ‘మైసూర్ శాండల్ సోప్’ను తయారు చేసే ప్రభుత్వ యాజమాన్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL)కి మాదాల్ విరూపాక్షప్ప చైర్మన్. అతని కుమారుడు బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB)లో చీఫ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. గురువారం, కర్ణాటక లోకాయుక్త అధికారులు విరూపాక్షప్ప కుమారుడిని KSDL కార్యాలయంలో ₹ 40 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకుని అరెస్టు చేశారు. కార్యాలయంలో కనీసం మూడు బ్యాగుల నగదు లభించిందని, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. లోకాయుక్త అవినీతి నిరోధక శాఖ నిన్న ₹ 40 లక్షలు లంచం తీసుకుంటుండగా బిజెపి ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్‌ను పట్టుకున్నారు. అతని కార్యాలయంలో ₹ 1.7 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు కర్ణాటక లోకాయుక్త తెలిపింది.

2008 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి ప్రశాంత్ మదాల్ లంచం డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదుతో తాము రంగంలోకి దిగినట్టు అంబుడ్స్‌మన్ అధికారులు తెలిపారు. సబ్బులు, ఇతర డిటర్జెంట్ల తయారీకి అవసరమైన ముడిసరుకు డీల్ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డాడు. దావణగెరె జిల్లా చన్నగిరి నుంచి విరూపాక్షప్ప ఎమ్మెల్యేగా ఉన్నారు.