ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు
రష్యా క్షిపణులతో కీవ్ పై విరుచుకుపడిన నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి హామీ ఇచ్చారు.

ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులను బైడెన్ ఖండించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. రష్యావి మతిలేని చర్యలని ఆయన విమర్శించారు. ఉక్రెయిన్ ఆత్మరక్షణకు అవసరమైన సాయం చేసేందుకు బైడెన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అందిస్తామని చెప్పారు” అని శ్వేత సౌధం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతే కాదు రష్యా యుద్ధానికి తగిన మూల్యం చెల్లించేలా మిత్రదేశాలతో కలిసి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని కూడా జెలెన్స్కీకి ఆయన వివరించారు. నేడు బైడెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీ7 అత్యవసర భేటీలో పాల్గొనే అవకాశం ఉంది.