Home Page SliderNational

హిమాచల్‌లో కాంగ్రెస్ దూకుడు, 6గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

Share with

హిమాచల్ సర్కారును బీజేపీ కూలదొస్తోందన్న లెక్కల నడము అక్కడి కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా… రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్‌ ఓటు వేసిన హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తున్నట్లు స్పీకర్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. బిజెపి అధికారంలో ఉన్న హర్యానాలో నిన్న రాత్రి బస చేసిన తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినప్పుడు వారి ‘ధైర్యసాహసాలు’ బిజెపి సభ్యులు చప్పట్లు కొట్టి అభినందించి కొద్దిసేపటికే… వారిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్ భూటూ, రవి ఠాకూర్, చైతన్య శర్మ స్పీకర్ అనర్హత వేటువేశారు.

సభలో ఆర్థిక బిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలన్న పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు వారిని అనర్హులుగా ప్రకటించామని అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈరోజు తెలిపారు. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడంతో అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించింది. ఆరుగురు ఎమ్మెల్యేల చర్యలు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించాయని స్పీకర్ అన్నారు. ప్రస్తుతానికి, ఆరుగురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీకి ఓటు వేసినందున, అవిశ్వాస ఓటుతో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందన్న చర్చ నడము, ప్రస్తుతానికి హిమాచల్ ఎపిసోడ్‌లో కాంగ్రెస్ పార్టీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది.

కేవలం 25 మంది ఎమ్మెల్యేలతో ఉన్న బీజేపీ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఓవర్ టైం పని చేస్తుందా అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. ఆరుగురు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను మినహాయిస్తే, 62 మంది సభ్యుల సభలో ఇప్పుడు కాంగ్రెస్‌కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్‌ ఓటు వేశారు. “ప్రజాస్వామ్యంలో, ప్రజలకు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉంది. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఈ హక్కును ఉపయోగించుకున్నారు. స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ బిజెపి ధన శక్తిని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజల ఈ హక్కును అణిచివేయాలనుకుంటోంది. ఏజెన్సీల అధికారం, కేంద్ర అధికారంతో ప్రభుత్వాలను మార్చేయాలనుకుంటున్నారు” అని ప్రియాంక గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు.