జగన్మోహన్ రెడ్డికి కొత్త టెన్షన్… గెలుపునకు పథకాలు మాత్రమే చాలవా?
◆ సంతృప్తి చెందని పేద వర్గాలు
◆ పెరిగిన ధరలతో సతమతం
◆ పథకాల లబ్ధిదారులలో తెలియని అసహనం
◆ స్వయం ఉపాధి పథకాలు లేకపోవటంపై యువత అక్కసు
◆ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న పేద ప్రజలు
ఏపీలో 2019 ఎన్నికలలో వైసీపీ, మేనిఫెస్టోలో నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టి అధికారంలోకి రాగానే కచ్చితంగా వాటిని అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. నవరత్నాల పథకాలు నచ్చటంతో ప్రజలు కూడా అత్యధిక మెజార్టీతో 151 స్థానాల్లో గెలిపించి ఆ పార్టీకి పట్టం కట్టారు. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన నవరత్నాల పథకాలతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇచ్చిన హామీలను ఆ పార్టీ నిలబెట్టుకుంటోంది. కానీ రాబోయే ఎన్నికల్లో ఈ పథకాలు తమ పార్టీని గట్టెక్కిస్తాయా లేదా అని చాలామంది వైసీపీ నేతలు భావిస్తున్నారు.

ఏ ప్రభుత్వానికైనా అన్ని విధాలా ప్రజలను మెప్పించడం చాలా కష్టం. ఎవరైనా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరగాలని కోరుకుంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి పెట్టడంతో ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ గట్టెక్కాలంటే ఈ సంక్షేమ పథకాలతో పాటు కొత్త అస్త్రాలను ప్రయోగిస్తే తప్ప గట్టెక్కే పరిస్థితి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకున్న రాజకీయ అనుభవంతో ఇప్పటికే పార్టీని పటిష్ట పరచడంతో పాటు తగిన ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావాలని ఉవ్వి్ళ్లూరుతున్నారు. ప్రతిపక్ష పార్టీని దీటుగా ఎదుర్కొని వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే పేద ప్రజల ఆదాయ మార్గాలను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా… నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తున్న వాటి ముందు సగటు ప్రజల ఆర్థిక సమస్యలు ఈ పథకాలను డామినేట్ చేస్తున్నాయి.

అమ్మ ఒడి, బోధనా ఫీజుల చెల్లింపు, విద్యాదీవెన, చేయూత, ఆసరా, వాహన మిత్ర ,కాపు నేస్తం, నేతన్న నేస్తం, రజకులు నాయి బ్రాహ్మణులు దర్జీలకు పదివేల నగదు, ఇంకా రైతు భరోసా లాంటి ఎన్నో పథకాలు అమలు చేసిన కూడా ఓ సాధారణ కుటుంబం ఆదాయాన్ని పెంచేందుకు తీసుకున్న చర్యలు ఏమీ కనిపించక పోవటంతో సంతృప్తి స్థాయి కన్నా అసంతృప్తిస్తాయి ఎక్కువగా కనబడుతుంది. దీనికి తోడు ప్రభుత్వం ఆస్తి పన్ను, చెత్త పన్ను, రవాణా కరెంటు చార్జీల భారాలు వేయటం , నిత్యవసర వస్తువుల ధరలు కొండెక్కడం, పెట్రోలు డీజిల్ ధరలు పెరగటంతో పేద వర్గాలు కుంగిపోతున్నాయి. దీంతో పేద వర్గాలు ప్రభుత్వం తమను ఆదుకోవడంలో విఫలమైందని అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.

ప్రధానంగా యువత కూడా తమకు స్వయం ఉపాధి పథకాలు లేవని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా జాబ్ మేళాలు నిర్వహించి చిన్నచిన్న ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్న కూడా వారు ఇచ్చే పదివేల వేతనంతో నెల అంత రెక్కల ముక్కలు చేసుకున్న కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవు అన్న భావనలో వారు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎన్నికల దాకా ఇలానే కొనసాగితే సగటు ప్రజల ఆక్రోశానికి ప్రభుత్వానికి తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావన. వైసీపి అధినేత జగన్ తమ ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను నిత్యం ప్రజలలో ఉండాలని వారి సమస్యలు పట్టించుకోవాలని ఎంత చెప్పినా వారు పెడచెవిన పెడుతున్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోగా వారి సమస్యలను దారి మళ్లిస్తున్నారు. ఈ పరిణామాలు చివరికి ఎక్కడికి దారితీస్తాయాని సామాన్య జనంలో ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా సంక్షేమ పథకాల అమలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని దీంతోపాటు పేద వర్గాల ఆదాయ మార్గాలు పెంచే విధంగా కూడా ప్రభుత్వం కృషి చేయాలని ప్రజలు భావిస్తున్నారు.


