ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ కింద పడి మహిళ మృతి
మృత్యువు ఏరూపంలో పొంచి ఉంటుందో ఎవరికీ తెలియదు. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అప్పటి వరకూ మాట్లాడుతూ ఉండేవారు విగతజీవులుగా మారిపోతూంటారు .
విజయవాడ దగ్గరలోని గణపవరానికి చెందిన వజ్రాల వెంకటనర్సమ్మ, భాస్కరరెడ్డి దంపతులు బుధవారం పొద్దున్నే విజయవాడలో మధుమేహ వైద్య పరీక్షలకు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో గమ్యం చేరుతారనగా,రావరప్పాడు రింగు వద్ద ప్రధాన రహదారిని దాటుతున్నప్పుడు లారీ ఎదురుగా వస్తోంది. స్కూటర్‌పై వెనుక కూర్చున్న భార్య ‘లారీ మీదకొస్తోందండీ’ అంటూ భర్తను హెచ్చరిస్తూనే ఘోరప్రమాదానికి గురైంది. లారీ ఢీకొని రోడ్డుపై పడిపోయిన భర్త, భార్య కోసం వెదకుతూ లారీ చక్రాల కింద ఆమె విగతజీవిగా ఉండడం చూసి కుప్పకూలారు. తన భార్య చివరి మాటలు తలుచుకుని భోరున ఏడ్చాడు.
మృతురాలి కుమారుడు, కుమారైలు హైదరాబాదులో ఉంటున్నారని, దంపతులిద్దరే గణపవరంలో ఉంటున్నారని సమాచారం. వైద్యపరీక్షలకు వినాయకచవితి ముందే వెళ్లాల్సి ఉండగా, పండుగ తర్వాత వెళ్దామని వాయిదా వేసుకున్నారట. భాస్కరరెడ్డికి గాయాలవడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. గ్రామస్థులు, బంధువులు పెద్ద ఎత్తున విజయవాడ ఆస్పత్రికి చేరుకుని ఆమె మృతదేహాన్ని స్వగ్రామం గణపవరం తీసుకువచ్చారు.

