19 ఏళ్ల తర్వాత తస్లీమా రీ-ఎంట్రీ
ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్లీ కోల్‌కతా గడ్డపై అడుగుపెట్టారు. శుక్రవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, “ఇంటికి తిరిగొచ్చినట్టే అనిపిస్తోంది. కోల్‌కతాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2007లో వివాదాస్పద పరిస్థితుల నేపథ్యంలో కోల్‌కతాను విడిచిపెట్టిన తస్లీమా, తాను స్వచ్ఛందంగా నగరాన్ని వీడలేదని స్పష్టం చేశారు. అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెళ్లాల్సిన పరిస్థితి కల్పించిందని, అయినప్పటికీ ఒకరోజు తిరిగి వస్తాననే ఆశను ఎప్పుడూ వదులుకోలేదని చెప్పారు. ప్రభుత్వాలు మారినా తిరిగి రావడానికి అవకాశం దక్కలేదని ఆమె పేర్కొన్నారు.
తస్లీమా రాసిన ఆత్మకథాత్మక గ్రంథం ‘ద్విఖండితో’ చుట్టూ నెలకొన్న వివాదాల కారణంగా 2007లో కోల్‌కతాలో నిరసనలు చెలరేగాయి. అంతకుముందు 2003లో ఆ పుస్తకంపై మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి వివాదాల కారణంగా దేశం విడిచిన తస్లీమా, అనంతరం కోల్‌కతాలో దాదాపు పదేళ్లపాటు నివసించారు. తస్లీమా రాకను బీజేపీ స్వాగతించగా, ఇతర రాజకీయ పార్టీలు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
కోల్‌కతా పర్యటనలో భాగంగా శనివారం రవీంద్ర సదన్‌లో జరిగే సాహిత్య కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ప్రస్తుతం 63 ఏళ్ల తస్లీమా నస్రీన్ ఢిల్లీలో దీర్ఘకాలిక నివాస అనుమతితో జీవిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె కోల్‌కతా పర్యటన సాహిత్య, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

