Home Page SliderNationalNews AlertTrending Today

శిశువును వద్దన్న తల్లి.. రంగంలోకి అధికారులు

చిక్కబళ్లాపురం (కర్ణాటక): కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ అవివాహిత యువతి ప్రసవం అనంతరం పుట్టిన శిశువును తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో వైద్యులు, పోలీసులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. హావేరి జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి వివాహం కాకుండానే గర్భం దాల్చింది. గర్భధారణ పూర్తికావడంతో ప్రసవం కోసం దేవనహళ్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే శిశువుకు తక్కువ బరువు ఉండటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు ఉండటాన్ని గుర్తించిన వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

ప్రసవానికి సంబంధించిన ఆసుపత్రి బిల్లులను యువతి చెల్లించినప్పటికీ, తనకు ఆ బిడ్డను పెంచే పరిస్థితి లేదని, శిశువును తీసుకెళ్లబోనని వైద్యులకు స్పష్టం చేసినట్లు సమాచారం. తాను స్వగ్రామానికి వెళ్లిపోతానని చెప్పడంతో ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు.

దీంతో ఆసుపత్రి యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని యువతి వివరాలు, కుటుంబ పరిస్థితులపై ఆరా తీశారు. అలాగే శిశు సంక్షేమ శాఖ (Child Welfare Department) అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు యువతితో మాట్లాడి శిశువును స్వీకరించేలా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, చట్ట ప్రకారం శిశువు సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుని, శిశు సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో తదుపరి ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, యువతి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.