రియాల్టీ షోలో గిల్ సోదరి ఎంట్రీ
భారత క్రికెట్ స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ సోదరి షానీల్ గిల్ బాలీవుడ్ అండ్ డిజిటల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారారు. క్రికెట్ స్టేడియంలలో సోదరుడికి మద్దతుగా కనిపిస్తూ అభిమానులకు సుపరిచితమైన ఆమె, ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకునేందుకు రియాలిటీ షోల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన ‘ది ట్రైటర్స్ 2’ షో ద్వారా ఆమె టీవీ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఈ షో లాంచ్ ఈవెంట్లో షానీల్ గిల్ ఇచ్చిన మైండ్ బ్లాకింగ్ ఇంట్రడక్షన్ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. “మై నేమ్ ఈజ్ గిల్.. అండ్ ఐ నో హౌ టు కిల్” అంటూ ఆమె చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. స్టార్ క్రికెటర్ సోదరిగా మాత్రమే కాకుండా, ఒక పవర్ఫుల్ అభ్యర్థిగా ఆమె చూపించిన ఆత్మవిశ్వాసంపై క్రీడా, సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకున్న షానీల్, కెనడాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసి కార్పొరేట్ రంగంలో పనిచేసిన అనుభవం కలిగినవారు. మల్లికా షెరావత్, మునావర్ ఫారూకీ, రియా చక్రవర్తి, రణ్వీర్ బ్రార్ వంటి అనేకమంది ప్రముఖులతో కలిసి ఈ మైండ్ గేమ్స్, వ్యూహాత్మక పోటీల షోలో ఆమె పోటీపడనున్నారు. ప్రైమ్ వీడియోలో ఆగస్టు 13 నుంచి ప్రసారం కానున్న ఈ షోలో షానీల్ గిల్ ఎలాంటి వ్యూహాలతో సందడి చేయబోతున్నారోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

