Home Page SliderNationalNews AlertSportsTrending Today

సొంత బ్రాండ్‌తో కోహ్లీ దూకుడు

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ క్రికెట్‌తో పాటు వ్యాపార రంగంలోనూ తన ముద్ర వేస్తున్నారు. ‘One8’ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆయన కీలక అడుగులు వేస్తున్నారు. ఇటీవల తన కొత్త ఫుట్‌వేర్ కలెక్షన్‌ను పరిచయం చేస్తూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2017లో పూమాతో ప్రారంభమైన ‘One8’ ప్రయాణంలో తాజాగా కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.300 కోట్ల పూమా ఒప్పందాన్ని కొనసాగించకుండా, పూమా ఇండియా మాజీ ఎండీ అభిషేక్ గంగూలీ స్థాపించిన ‘అజిలిటాస్ స్పోర్ట్స్’తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ సంస్థలో రూ.40 కోట్లు పెట్టుబడి పెట్టి 1.94 శాతం వాటా కూడా సొంతం చేసుకున్నారు. దీంతో ఆయన కేవలం బ్రాండ్ అంబాసిడర్‌గా కాకుండా భాగస్వామిగా మారారు.

ఉత్పత్తుల నాణ్యత విషయంలో కోహ్లీ ఎలాంటి రాజీ పడలేదు. తనకు నచ్చకపోవడంతో వరుసగా 17 డిజైన్లను తిరస్కరించి, 18వ నమూనాకు మాత్రమే ఆమోదం తెలిపారు. “నేను ధరించని ఉత్పత్తిని ఇతరులు కొనాలని ఎలా కోరతాను?” అని ఆయన పేర్కొన్నారు. కొత్త ఫుట్‌వేర్ శ్రేణిలో రన్నింగ్ షూస్, ట్రైనింగ్ షూస్, స్నీకర్స్‌తో పాటు ‘SEAM XVIII Signature Test Red’ క్రికెట్ స్పైక్స్‌ను విడుదల చేశారు. టెస్ట్ క్రికెట్‌లో చేసిన 9,230 పరుగులకు గుర్తుగా ఈ షూ ధరను రూ.9,230గా నిర్ణయించారు. ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ ఈ స్పైక్స్‌ను ఉపయోగించడం బ్రాండ్‌కు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ‘One8’తో పాటు WROGN, Chisel, One8 Commune, Digit Insurance వంటి పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన కోహ్లీ, వ్యాపార రంగంలోనూ విజయవంతంగా దూసుకెళ్తున్నారు.