ట్రంప్ టారిఫ్ షాక్.. భారత్‌కు 10% సుంకం
బలవంతపు శ్రమ, వెట్టిచాకిరీతో తయారయ్యే ఉత్పత్తులను అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద మొత్తం 60 దేశాలపై అదనపు దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. మొదట భారత్‌పై 12.5 శాతం సుంకం విధించాలని భావించినా, బలవంతపు కార్మికులతో తయారయ్యే ఉత్పత్తులపై భారత్ ఇటీవల తీసుకున్న సంస్కరణలను పరిగణనలోకి తీసుకుని దానిని 10 శాతానికి తగ్గించినట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ తెలిపారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
అమెరికా దేశాలను రెండు వర్గాలుగా విభజించింది. భారత్, యూకే, కెనడా, బంగ్లాదేశ్, మెక్సికో, పాకిస్తాన్, శ్రీలంక తదితర 17 దేశాలపై 10 శాతం సుంకం విధించగా, నిబంధనలను పాటించని ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ సహా 43 దేశాలపై 12.5 శాతం సుంకం విధించింది.
వెట్టిచాకిరీ ఉత్పత్తులపై అమెరికా చాలా కాలంగా కఠిన వైఖరి అవలంబిస్తోందని, వాణిజ్య భాగస్వాములు కూడా అదే ప్రమాణాలను పాటించాలని జేమిసన్ గ్రీర్ పేర్కొన్నారు. ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో మానవ హక్కుల పరిరక్షణ, జవాబుదారీతనం పెంచడమే ఈ చర్య లక్ష్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

