పోలీసులు–కాంగ్రెస్ మధ్య తోపులాట
దిల్లీలో రాహుల్ గాంధీపై దాడి, విద్యార్థులపై లాఠీచార్జీ, అరెస్టులను ఖండిస్తూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్టీ సీనియర్ నేత వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్ నుంచి హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వినోద్ రెడ్డి డిమాండ్ చేశారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ప్రశ్నపత్రాలను కాపాడలేని వారు దేశాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన కోరారు.
అనంతరం కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

