1,000 టెక్ జాబ్స్.. జేపీ మోర్గాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఉద్యోగాల కోతలు అమలు చేస్తున్న వేళ, అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గాన్ భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) విభాగాల కోసం సుమారు 1,000 మంది సాంకేతిక నిపుణులను నియమించనున్నట్లు ప్రకటించింది.
క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ప్రాసెస్ ఆటోమేషన్, సిస్టమ్ ఆర్కిటెక్చర్ వంటి కీలక విభాగాల్లో నియామకాలు చేపట్టనుంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, బెంగళూరు, నోయిడా, గాంధీనగర్ కేంద్రాల్లో కలిపి జేపీ మోర్గాన్‌కు సుమారు 55,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అలాగే ముంబైలోని పవాయ్‌లో 2029 నాటికి ఆసియాలోనే అతిపెద్ద GCC క్యాంపస్‌ను నిర్మిస్తోంది. సుమారు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ కేంద్రంలో దాదాపు 30,000 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు.
ఈ నియామకాల్లో అభ్యర్థుల సాంకేతిక నైపుణ్యాలను హ్యాకథాన్‌లు, కోడింగ్ ఛాలెంజ్‌లు, డేటా స్క్రీనింగ్, ఆర్కిటెక్చరల్ డిజైన్ పరీక్షల ద్వారా అంచనా వేయనున్నారు. భారత్ కేవలం బ్యాక్‌ఆఫీస్ సేవలకే కాకుండా, ప్రపంచస్థాయి సాంకేతిక ఉత్పత్తుల అభివృద్ధికి కీలక కేంద్రంగా ఎదుగుతోందని జేపీ మోర్గాన్ పేర్కొంది.

